republichindustan.in
Newspaper Banner
Date of Publish : 10 February 2024, 11:45 am Digital Edition : REPUBLIC HINDUSTAN

ఫాస్టాగ్స్‌ ఉండవు.. కేంద్రం కీలక నిర్ణయం..

గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి GPS ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారనుంది.

ఫాస్టాగ్‌లు అనేవి ఎలక్ట్రానిక్ ట్యాగ్స్‌. వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించవచ్చు. ట్రాఫిక్ రద్దీ, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2016లో వీటిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికీ లో-బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలు వంటి కొన్ని సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.

* ఎన్నో ప్రత్యేకతలు

GPS ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీతో వర్క్ అవుతాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది. GPS-ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్‌ల కంటే అనేక ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది. అవేంటంటే..

* బెనిఫిట్స్ ఇవే..

జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి వస్తే, టోల్ ప్లాజాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాల్సిన లేదా ఆపాల్సిన అవసరం రాదు. దీనివల్ల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇది ఫాస్టాగ్స్‌ను రీఛార్జ్ చేయడం లేదా తగినంత బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందడం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది. దీనివల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురుకావు.

* ఫాస్టాగ్స్ ఉంటాయా?

GPS ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్స్‌ను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ప్రధాన రహదారులతో ప్రారంభించి క్రమంగా అన్ని చోట్లా దీనిని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇది వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్‌లు నిరుపయోగంగా మారవు. వీటిని చిన్న రహదారులపై లేదా బ్యాకప్ ఆప్షన్‌గా భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు.

* త్వరలో ప్రారంభం

2024, ఏప్రిల్ ప్రారంభంలో GPS ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా ప్రైవసీ వంటి ఏవైనా సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకురావచ్చు. మొత్తం మీద GPS ఆధారిత టోల్ సిస్టమ్ భారతదేశంలో హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చగలదు. టోల్ బూత్‌లను తొలగించడం, మరింత సమర్థవంతమైన వ్యవస్థను అందిస్తూ, ఇది దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణికులు, సరకు రవాణాదారులకు ప్రయాణ సమయాన్ని, సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.