republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 12:25 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సౌదీ అరేబియాలో తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్‌లో ఘన ప్రారంభం

హైల్, సౌదీ అరేబియా | రిపబ్లిక్ హిందుస్థాన్:
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న తెలుగు టైలర్ల ఐక్యత, అభివృద్ధి మరియు పరస్పర సహకారాన్ని లక్ష్యంగా చేసుకుని తెలుగు టైలర్స్ అసోసియేషన్ (TTA) హైల్ నగరంలో ఘనంగా ప్రారంభించబడింది.

ఈ కార్యక్రమానికి తెలుగు సమాజ సభ్యులు, టైలరింగ్ వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా భగ్గేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ చెల్లబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ సంఘం తెలుగు టైలర్ల ఐక్యతకు బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, వెదుర్లంకకు చెందిన శ్రీ కట్టా రమణ మాట్లాడుతూ, సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగి, భవిష్యత్ కార్యాచరణపై సార్థక చర్చలు జరిగాయని తెలిపారు.

సంఘ కార్యదర్శి, దొడ్డిపట్ల గ్రామానికి చెందిన శ్రీ అంజిబాబు మాట్లాడుతూ, సౌదీ అరేబియాలో తెలుగు టైలర్ల ప్రతిభ, కృషి, ఐక్యతకు ఈ సంఘం ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జాయింట్ సెక్రటరీ, భగ్గేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ పితాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ వేదిక ద్వారా పరస్పర పరిచయాలు పెరిగి, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, సహకారం మరియు అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి యానాం కు చెందిన విత్తనాల నరేష్, అల్లవరం కు చెందిన బొంతు సాయిబాబు, సోషల్ సర్వీస్ వారియర్ మరియు ఎంబసీ వాలంటీర్ శ్రీ చాన్సా రహమాన్, హైల్ GIO అధ్యక్షులు (కేరళ), అలాగే ఒంగోలు కు చెందిన డాక్టర్ వంశీ (హైల్ యూనివర్సిటీ ప్రొఫెసర్) సహకరించారు. కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి వాలంటీర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెశన్ మాట్లాడుతూ, హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘం ద్వారా తెలుగు టైలర్లకు ఐక్యత, హక్కుల పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి మరియు భవిష్యత్ అవకాశాలకు బలమైన వేదిక ఏర్పడుతుందని పేర్కొన్నారు.

సౌదీ అరేబియాలో తెలుగు సమాజం ఈ కొత్త సంఘం ద్వారా మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేసింది.