republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 February 2025, 12:18 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

TS RATION CARD UPDATE: రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన అర్జీలు, కుల గణనతో పాటు గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.
ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినప్పటికీ, మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డులకు ఎందుకు రద్దీ ఉంటుందని ముఖ్యమంత్రి  ఆరా తీశారు. దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులు జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా వెంటనే కొత్త కార్డులు జారీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని, అయితే ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉందని, నియమావళి అమలులో లేని జిల్లాల్లో ముందుగా కార్డులను జారీ చేయాలని చెప్పారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని సూచించారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా పరిశీలించారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!