– రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని
Thank you for reading this post, don't forget to subscribe!
జనవరి 07, 2026 – ఆదిలాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఈ నెల 12న వార్డుల వారీగా ఫోటో ఎలక్ట్రోల్ ఓటరు జాబితాలను ప్రచురించడంతో పాటు, 13న డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. అలాగే 16న తుది పోలింగ్ కేంద్రాల జాబితాతో పాటు, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటరు జాబితాలను కూడా ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

2025 సంవత్సరానికి సంబంధించిన మూడో సప్లిమెంటరీ ఓటరు జాబితాను నవంబర్ 15న విడుదల చేసినట్లు తెలిపారు. దాని ఆధారంగా జనవరి 1న పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు కమిషనర్‌కు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, మున్సిపల్ కమిషనర్, నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.