ఆదిలాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని భారీ మోసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో పాటు, ఇద్దరిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ కె. నాగరాజు వెల్లడించారు. కేర్ ఫౌండేషన్, సైన్స్ ఇన్నోవేషన్ పేరుతో నడిపిన ఈ కొత్త జాబ్ ఫ్రాడ్ కలకలం రేపుతోంది.
🔸 లక్షల్లో వసూలు – బాధితుల సంఖ్య ఏకంగా పదుల వరుకు
పట్టణానికి చెందిన బాధితుడు మహమ్మద్ యాకూబ్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష నుండి లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 10–15 మందికి పైగా బాధితులు ఉండవచ్చని అంచనా.
🔸 నిందితుల వివరాలు
1. ఎడ్ల చంద్రయ్య (45) – s/o రామయ్య, హైదరాబాద్
2. గేడం మనోజ్ (29) – s/o ప్రకాష్, ఆదిలాబాద్
3. సుజాత ఠాకూర్ – హైదరాబాద్ (ప్రస్తుతం పరారి)
ఫిర్యాదుదారుడు నుండి వసూలు చేసిన డబ్బులను గేడం మనోజ్, చంద్రయ్య కలిసి ప్రధాన నిందితురాలు సుజాత ఠాకూర్‌కు అందజేసినట్లు విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, సుజాత కోసం గాలింపు కొనసాగుతోంది.
🔸 “ప్రభుత్వ ఉద్యోగాలు డబ్బులకు రావు” – పోలీసులు హెచ్చరిక
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ IPS ఆదేశాల మేరకు ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వారిని నమ్మవద్దని హెచ్చరించారు.
🔸 బాధితులు భయపడకుండా ముందుకు రావాలి
కేర్ ఫౌండేషన్ పేరుతో మోసపోయిన వారు ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదిస్తే
చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
🔸 నిరుద్యోగుల ఆశలతో ఆడుకునే నేరగాళ్లపై కఠిన చర్యలు
సులువుగా డబ్బులు సంపాదించాలనే నేరగాళ్ల దాహానికి భవిష్యత్తు బలి అవుతున్న అమాయక నిరుద్యోగులను రక్షించేందుకు
జిల్లా పోలీసు యంత్రాంగం గట్టిగా పట్టు కలిగిస్తుందని సీఐ స్పష్టం చేశారు.