అదిలాబాద్, నవంబర్ 24 : మద్యం సేవించి వాహనం నడపడంతో మహిళా మరణానికి కారణమైన కేసులో నిందితుడైన ఆటోడ్రైవర్ షేక్ జావిద్ పాషా (28) s/o మౌలానా, న్యూ కాలనీ బోథ్‌కు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి సీఎం రాజ్యలక్ష్మి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 8,500 జరిమానా విధించారు. ఈ కేసులో 19 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిశీలించింది.
2021 మార్చి 24న సోనాల ఆటో స్టాండ్ వద్ద మద్యం సేవించి ఉన్న నిందితుడు షేక్ జావిద్ పాషా ఆటోను నిర్లక్ష్యంగా నడపడంతో టివిటి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడగా, సోనాల గ్రామానికి చెందిన పవర్ నిర్గుణ తీవ్రంగా గాయపడి అధిక రక్తస్రావంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించింది. మిగతా గాయపడిన వారికి చికిత్స అందించారు.
ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు పవర్ అరవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 31/2021, సెక్షన్ 304-II, 338, 337 IPC కింద కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ ఎం. నైలు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు లైజన్ అధికారి ఏఎస్ఐ వెంకటమ్మ, కోర్టు డ్యూటీ అధికారి డి. శ్రీనివాస్ 19 మంది సాక్షులను హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ షాహినా సుల్తానా వాదనలు వినిపించగా నిందితుడిపై నేరం రుజువైంది.
కఠినమైన శిక్షలతోనే ఇటువంటి నేరాలు అదుపు అవుతాయని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు. కేసు నిరూపణలో ప్రతిభ కనబరిచిన కోర్టు డ్యూటీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.