• Other News
  • Live TV
  • భారత్‌కు రష్యా భారీ రక్షణ ఆఫర్

    భారత్‌కు రష్యా భారీ రక్షణ ఆఫర్

    సుఖోయ్-57 టెక్నాలజీ బదిలీకి మాస్కో సిద్ధం
    పుతిన్ పర్యటనకు ముందే కీలక సంకేతాలు
    వాయుసేన స్వరూపాన్ని మార్చే ప్రతిపాదన

    మాస్కో, నవంబర్ 20 :
    రష్యా మరోసారి భారత్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపడే దిశగా ముందడుగు వేసింది. వచ్చే నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, భారత వాయుసేన భవిష్యత్తు మార్పు దిశగా కీలక ప్రతిపాదనను మాస్కో ప్రకటించింది. ఐదో తరం సుఖోయ్-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌కు సంబంధించిన పూర్తి టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేసేందుకు సిద్ధమని వెల్లడించడం అంతర్జాతీయ రక్షణ రంగంలో విశేష చర్చకు దారితీసింది. దుబాయ్ ఎయిర్ షో–2025 సందర్భంగా రోస్‌టెక్ సీఈఓ సెర్గీ చెమెజోవ్ ఈ వివరాలను వెల్లడించారు. తొలి దశలో రష్యాలో తయారైన Su-57 ఫైటర్లను భారత్‌కు సరఫరా చేసి, తదనంతరం దశలవారీగా వాటి ఉత్పత్తి లైన్లను పూర్తిగా భారత్‌కు తరలించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అదనంగా, సింగిల్ ఇంజిన్ స్టెల్త్ ఫైటర్‌ జెట్ ‘సుఖోయ్-75 చెక్‌మేట్’ను కూడా భారత్‌కు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంజిన్ టెక్నాలజీ, స్టెల్త్ మెటీరియల్స్, ఏఈఎస్ఏ రాడార్‌లు, అత్యాధునిక సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థలు వంటి కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా బదిలీ చేయడానికి సిద్ధమని రష్యా స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాలు కీలకంగా భావించే ఈ టెక్నాలజీని అందించడంలో రష్యా ముందుకు రావడం భారత రక్షణ వ్యూహానికి పెద్ద బలమని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌పై ఆంక్షలు ఉన్న దశలో కూడా ఆయుధ సరఫరా చేస్తూ మాస్కో అండగా నిలిచిందని, రెండు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని చెమెజోవ్ గుర్తుచేశారు. ఈ ప్రతిపాదన అమలైతే భారత వాయుసేన సామర్థ్యాలు ప్రపంచస్థాయి ఐదో తరం టెక్నాలజీతో సమానమవుతాయని భావిస్తున్నారు.
    డిసెంబర్‌లో జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ఈ ప్రతిపాదనపై మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. పుతిన్ పర్యటన ముందు వచ్చిన ఈ సంకేతాలు, భారత్–రష్యా రక్షణ సంబంధాల కొత్త దశను సూచిస్తున్నాయని దౌత్యవర్గాలు పేర్కొంటున్నాయి.

    📰 e-Paper Clip
    Google News Follow