republichindustan.in
Newspaper Banner
Date of Publish : 16 February 2024, 1:10 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

పేటీఎంకు బిగ్ రిలీఫ్

ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది.

Thank you for reading this post, don't forget to subscribe!

కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కొద్దిరోజుల కిందటే రిజర్వ్ బ్యాంక్..కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా దీనిపై నిషేధం విధించింది. ఈ నెల 29వ తేదీ తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోతాయి.

ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన వాటి షేర్ ప్రైస్ ఒక్కసారిగా కూప్పకూలింది. 300 రూపాయలకు పడిపోయింది. నేడు స్టాక్ మార్కెట్‌లో పేటీఎం సింగిల్ పీస్ ప్రైస్ రూ.341.30 పైసల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఒక్కరోజే అయిదుశాతం మేర వాటి ధర పెరిగింది.

ఈ పరిస్థితుల్లో పేటీఎం యాజమాన్యానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది రిజర్వు బ్యాంక్. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని సడలించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అమలు కావాల్సిన నిషేధం గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. అంటే.. మార్చి 14వ తేదీ వరకూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్, ఫాస్టాగ్ పని చేస్తాయి.

ఈ మేరకు ఆర్బీఐ ఓ సర్కులర్‌ను జారీ చేసింది. గడువులోగా పేటీఎం అకౌంట్స్, వాలెట్ నుంచి తమ నగదు మొత్తాన్ని డిపాజిటర్లు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. స్వీప్ ఇన్, స్వీప్ అవుట్ విధానంలో ఇతర బ్యాంకులకు తమ నగదును బదిలీ చేయించుకునే అవకాశాన్ని పేటీఎం యాజమాన్యం డిపాజిటర్లకు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది.

నిషేధం అమలు గడువును ఆర్బీఐ పొడిగించిన నేపథ్యంలో పేటీఎం షేర్ల ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇవ్వాళ ఒక్కరోజే అయిదు శాతం మేర షేర్ల ధరలు పెరగడాన్ని ఉదహరిస్తోన్నాయి. దీనితో సోమవారం రీఓపెన్ అయ్యే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌పై అందరి దృష్టీ నిలిచినట్టయింది.