republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 10:58 am Digital Edition : REPUBLIC HINDUSTAN

మోడీని కలుస్తా… ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను : సిఎం

చెప్పిందే చేస్తా.. : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఖమ్మం: చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. తాను ఫామ్‌ హౌస్ లో పడుకున్నోడిలా కాదని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తాను చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని వెల్లడించారు. తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం, ఇతర నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు. తెలంగాణకు వరదల కారణంగా రూ.5438 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

మోదీని కలుస్తా..

పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుందని రేవంత్ అన్నారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమెరికా పోయి కూర్చున్నోడు తలకాయ లేకుండా మాట్లాడుతుండని విమర్శించారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించానని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని వెళ్లి కలుస్తానన్నారు. అనుక్షణం ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు కష్టపడుతున్నామన్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామాలకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని రేవంత్ తెలిపారు. శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం తిరిగి కోలుకునే వరకూ అండగా నిలబడతామని వెల్లడించారు.

మనం మెరుగే..

పక్క రాష్ట్రంతో పోల్చి చూస్తే మనం చాలా మెరుగ్గా పని చేస్తామని రేవంత్ తెలిపారు. విపత్తు నుంచి ప్రజలు కాపాడుకునేందుకు అవసరమైన అన్ని రకాల వ్యవస్థలను అప్రమత్తం చేసి ఉంచామన్నారు. పనికి మాలినోడు.. తలకాయ లేనోడు అమెరికాలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడని విమర్శించారు. 80,000 పుస్తకాలు చదివినోడు ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే ప్రతిపక్షంలో ఉన్నోడు నోరు మెదపలేకపోతున్నాడని విమర్శించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కనీసం కన్నెత్తి కూడా చూడలేదన్నారు. ప్రజలు అధైర్పడాల్సిన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని రేవంత్ భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతుందన్నారు. హైడ్రా ఆగదని.. ముందుకెళుతుందన్నారు. హైదరాబాద్ పట్టణాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవలసిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. నిపుణులు.. అనుభవజ్ఞులు.. ఇంజనీర్లతో మాట్లాడుతున్నామన్నారు. తప్పనిసరిగా హైదరాబాద్‌ను మార్చి చూపిస్తామని రేవంత్ తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!