republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 February 2024, 12:43 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

కేజ్రీవాల్‌ ఇంటికెళ్లిన ఢిల్లీ పోలీసులు.. సిఎంని అరెస్టు చేస్తారా…?

Thank you for reading this post, don't forget to subscribe!

న్యూఢిల్లీ :
ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వాన్ని బెజిపి టార్గెట్‌ చేస్తోంది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం ఆప్‌ మంత్రులైన సత్యేందర్‌ జైన్‌, మనీష్‌ సిసోడియాను అరెస్టు చేసి జైలులో ఉంచింది. ఇప్పుడు ఆ రాష్ట్ర సిఎంనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇడి ద్వారా సమన్లు జారీ చేస్తోంది. మద్యం కుంభకోణం కేసులో పలుసార్లు కేజ్రీవాల్‌కి ఇడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇడి విచారణకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్‌ నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు శనివారం ఉదయం ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌కి చెందిన పోలీసుల బృందం కేజ్రీవాల్‌ ఇంటికెళ్లింది. ఇటీవల ఆప్‌ ఎమ్మెల్యేలను బిజెపి కొనేందుకు ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై క్రైమ్‌ బ్రాంచ్‌ బృందాలు నోటీసులివ్వడానికి శుక్రవారం ఢిల్లీ సిఎం, ఆప్‌ మంత్రి అతిషి ఇళ్లకు కూడా వెళ్లాయి. అయితే కేజ్రీవాల్‌ ఇంటి అధికారులు ఈ నోటీసును స్వీకరించడానికి నిరాకరించారు. అతిషి మాత్రం క్రైమ్‌ బ్రాంచ్‌ బృందాలు ఇంటికి వెళ్లే సమయానికి ఆమె ఇంట్లో లేరని మీడియా పేర్కొంది. అయితే ఈ నోటీసును కేజ్రీవాల్‌కు వ్యక్తిగతంగా ఇచ్చేందుకు క్రైమ్‌ బ్రాంచ్‌ భావిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
కాగా, కేజ్రీవాల్‌ ఆప్‌ ఎమ్మెల్యేలను బిజెపి కొనడానికి చూస్తోందని విమర్శించిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేజ్రీవాల్‌ అబద్దం వెనుక ఉన్న నిజం ఇప్పుడు బట్టబయలు కానుది. అతను అబద్ధం చెప్పలేడు. విచారణ నుండి తప్పించుకోలేడు’ అని ఢిల్లీ బిజెపి చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని.. ఆయన నిరాధారమైన ఆరోపణలు చేశారని సచ్‌దేవా అన్నారు. ఆప్‌ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారని ఢిల్లీకి చెందిన బిజెపి నేతలు ఆ రాష్ట్ర పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరాకు ఫిర్యాదు కూడా చేశారు.
బిజెపిలో చేరేందుకు..తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆప్‌కు చెందిన ఏడుగురి ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున బిజెపి ఆఫర్‌ చేసిందని గతవారం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌ సమయంలో బిజెపి ‘ఆపరేషన్‌ లోటస్‌ 2.0’ ప్రారంభించిందని ఆ రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి ఆతిషి విమర్శించారు. గతేడాది కూడా ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బిజెపి యత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు విఫలయ్యాయని అతిషి నొక్కి చెప్పారు.