republichindustan.in
Newspaper Banner
Date of Publish : 17 January 2022, 4:13 am Digital Edition : REPUBLIC HINDUSTAN

Telangana : ఉద్యోగాల బదిలీల పై అధ్యయన కమిటీ ఏర్పాటు

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్ , వెబ్ డెస్క్ : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలలో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాలలో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీకి సూచించారు. ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా ఏమేం చర్యలు తీసుకోవాలి తదితర అంశాల మీద ఈ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని సీఎం ఈ కమిటీకి సూచించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రామ రెడ్డి, ఎమ్మెల్యేలు సి. లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.