జొన్న లాప తిని 20 ఆవులు మృతి
ఆర్థిక సాయం కోరుతున్న రైతులు
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : బజార్ హత్నూర్ మండలం, బుర్కపల్లి గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజువారీగా మేతకు వెళ్లిన 20 ఆవులు జొన్న లేత మొలకలు (లాప) తినడం వల్ల మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారి గిరిదావర్ రాథోడ్ నూర్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, గ్రామ రైతులతో మాట్లాడారు. జొన్న లేత మొలకలు మేయడం వల్ల ఆవులు మరణించినట్లు రైతులు తెలిపారు.
మరణించిన ఆవుల యజమానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
బర్ధవాల్ నానాక్ సింగ్ - 3 ఆవులు
టాక్ డా నానాక్ సింగ్ - 4 ఆవులు
మాటవాన్ గులాబ్ సింగ్ - 1 ఆవు
సబడే చందర్ సింగ్ - 1 ఆవు
బర్ధవాల్ గురువే సింగ్ - 1 ఆవు
జాతీవే న్యాల్ సింగ్ - 1 ఆవు
జాతీవే సుభాష్ - 1 ఆవు
నిస్తే హుషార్ సింగ్ - 2 ఆవులు
బనియ రామ్ - 1 ఆవు
భామన్ పర్షు రామ్ - 1 ఆవు
బస్సి హర్ సింగ్ - 1 ఆవు
మాటవాన్ కాపుర్ చందు - 2 ఆవులు
మాటవాన్ గోపి చందు - 1 ఆవు
మొత్తం 13 మంది రైతులకు చెందిన 20 ఆవులు మరణించాయి. ఒక్కో ఆవు సుమారు 20,000 రూపాయల విలువైనదని, మొత్తం 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. తమ జీవనాధారమైన ఆవులను కోల్పోయిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. అధికారులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు.