republichindustan.in
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 6:13 pm Editor : REPUBLIC HINDUSTAN

అమ్మాయిల గొంతు మార్చి వ్యక్తిని మోసం చేసిన ముఠా అరెస్ట్

వలపు వలతో ఎనిమిది లక్షల స్వాహా
గొంతు మార్చి ప్రజలను ఏమార్చిన ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్ట్

ఆదిలాబాద్: మహిళ గొంతుతో మాట్లాడుతూ ప్రజలను నమ్మబలికి సైబర్ మోసం చేసిన ముగ్గురు నిందితులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా బాధితుడిని ప్రేమ పేరుతో మోసం చేసి మొత్తం రూ. 8 లక్షలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం — ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం. లక్ష్మీకాంత్ అనే వ్యక్తి తన వివాహానికై ఆన్‌లైన్ మరియు యూట్యూబ్‌లో వధువు కోసం శోధిస్తున్న సమయంలో, “కృష్ణవేణి” అనే అమ్మాయి పేరుతో యూట్యూబ్ ద్వారా పరిచయం ఏర్పడింది. రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి, మాలోత్ మంజి అనే ప్రధాన నిందితుణ్ణి పరిచయం చేశాడు.

Thank you for reading this post, don't forget to subscribe!

ప్రధాన నిందితుడు మాలోత్ మంజి (కృష్ణవేణి పేరుతో) మహిళ గొంతుతో మాట్లాడుతూ, తాను ధనవంతురాలని, తన ఆస్తులు కోర్టులో చిక్కుకుపోయాయని, వాటిని విడుదల చేసుకోవడానికి న్యాయవాదికి డబ్బులు అవసరమని నమ్మబలికాడు. అంతేకాకుండా, తన బంగారం వ్యాపారం మరియు ఇతర ఆస్తులు భవిష్యత్తులో బాధితుడే చూసుకోవాలని నమ్మబలికి, విడతలవారీగా రూ. 8 లక్షలు పొందాడు.

బాధితుడు మోసపోయిన విషయాన్ని గుర్తించి 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయగా, ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ సెల్ మరియు వన్‌టౌన్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం రెండు రోజుల వ్యవధిలోనే సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రామచంద్రపురం తండా ప్రాంతంలో నిందితులను పట్టుకున్నారు.

అరెస్టైన నిందితుల వివరాలు:
A1. మాలోత్ మంజి @ కృష్ణవేణి (21), S/o బాలు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా.
A2. బుక్య గణేష్ (19), S/o శ్రీను, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా.
A3. రూపవత్ శ్రావణ్ కుమార్ (18), S/o శంకర్, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా.

నిందితుల వద్ద నుండి రూ. 1.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ సెల్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్‌ఐ గోపీకృష్ణ, వన్‌టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.