republichindustan.in
Newspaper Banner
Date of Publish : 22 February 2024, 1:18 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఏం జరిగిందని చూసేలోపు పెను విషాదం…

ఆ ఇల్లు పెళ్లి సందడితో కళకళలాడిపోతుంది. పచ్చని పందిళ్లు, బంధువుల రాకపోకలు, చిన్న పిల్లల అల్లర్లు, యూత్ చిలిపి చేష్టలతో ఆహ్లాదకకరంగా మారింది. ఎటువంటి అడ్డంకి లేకుండా పెళ్లి సజావుగా ముగిసింది.

Thank you for reading this post, don't forget to subscribe!

ఎన్నో కళలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ జంట. పెళ్లి కాక ముందు కాబోయే జీవిత భాగస్వామితో సరిగ్గా మాట్లాడింది కూడా లేదు. పెళ్లయ్యింది.. అప్పుడప్పుడే మాట్లాడుకుంటున్నారు నూతన దంపతులు. ఆ ఈడు జోడును చూసి మురిసిపోతున్నాడు వధువు తండ్రి. తదుపరి వేడుకల కోసం నూతన దంపతులు, బంధువులు అమ్మాయి పుట్టింటికి వెళుతున్నారు. ఎంతో సందడి సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా కుదుపు. ఏం జరిగిందని చూసేలోపు పెను విషాదం. వధువు నుదిటిన పెళ్లి బొట్టు పెట్టి కనీసం వారం రోజులు కూడా కాలేదు. అంతలోనే సింధూరం చెరిగిపోయింది.

కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు.. భర్తను కోల్పోయింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నసాగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడుతో పాటు వధువు తండ్రి, కారు డ్రైవర్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మణికొండలో స్థిరపడిన కృష్ణా జిల్లాకు చెందిన పవన్ సాయి కుమార్‌ అనే యువకుడితో అనంతరపురానికి చెందిన వెంకట రమణ ఏకైక కూతురు అనూషకు పెళ్లి నిశ్చయం అయ్యింది. వెంకట రమణ నంద్యాల జిల్లా రాచర్ల ఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ నెల 15న అనంతపురంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అనంతరం పవన్ సాయి ఇంట్లో జరిగే విందులో పాల్గొనేందుకు వచ్చారు వధువు తరుపు బంధువులు. బుధవారం సాయంత్రం తిరిగి రెండు కార్లలో తమ ఇంటికి బయలు దేరారు ఎస్సై వెంకట రమణ. వధువు, వరుడితో పాటు ఇరు కుటుంబాల బంధువులు వెళుతున్నారు.

ఓ కారులో వధూవరులు పవన్ సాయి, అనూష, ఆమె నాన్న వెంకట రమణ వెళుతున్నారు. అన్నసాగర్ వద్దకు రాగానే..కారు అదుపు తప్పి.. జాతీయ రహదారి పక్కనున్న రెయిలింగ్‌ను బలంగా తాకి.. గాల్లోకి ఎగిరి.. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఎస్సై వెంకట రమణ, పవన్, కారు డ్రైవర్ చంద్ర అక్కడిక్కడే మృతి చెందారు. అనూష తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెళ్లై వారం కూడా గడవకుండానే ఇద్దరి ఇళ్లల్లో విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఇద్దరు జీవితాలతో పాటు రెండు కుటుంబాల భవిష్యత్తును మార్చేసింది ఈ ప్రమాదం. అటు భర్తను, ఇటు తండ్రిని ఒకేసారి కోల్పోయింది ఆ నవ వధువు.