republichindustan.in
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:27 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

సౌదీ అరేబియా రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి లక్ష్మీనారాయణ

గత కొన్ని రోజులుగా కుటుంబానికి అండగా నిలిచిన తెలుగు సామాజిక కార్యకర్తలు, టాసా మరియు సాటా ప్రతినిధులు

రియాద్: ఆంధ్రప్రదేశ్‌, కడపకు చెందిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం.

ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స (హార్ట్ సర్జరీ) నిర్వహించగా, అనంతరం అధిక రక్తపోటు మరియు అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే ఆయన యజమాని (స్పాన్సర్) కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లలో తనవంతు సహకారం అందిస్తున్నారు.

భారత్‌లో ఉన్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణకు చెందిన తెలుగు సామాజిక కార్యకర్త మహమ్మద్ షబ్బీర్ ఆసుపత్రి నుంచి అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు చేరవేస్తూ వారికి ధైర్యం కల్పిస్తున్నారు.

ఈ విషయాన్ని 26 జూలై 2026న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏపిఎన్ఆర్టిఎస్ కో-ఆర్డినేటర్‌కు కూడా మహమ్మద్ షబ్బీర్ సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, 6 ఆగస్టు 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున నియమించబడిన ఏపిఎన్ఆర్టిఎస్ ప్రతినిధులలో ఎవరూ లక్ష్మీనారాయణను ఆసుపత్రిలో స్వయంగా సందర్శించకపోవడం పట్ల పలువురు తెలుగు ప్రజలు, తెలుగు సంఘాల ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలవడం, వారి కుటుంబాలకు భరోసా కల్పించడం, అవసరమైన సహాయాన్ని అందించడం నిజమైన మానవత్వానికి నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు అసోసియేషన్ అఫ్ సౌదీ అరేబియా వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), సాటా రియాద్ కోర్ టీమ్ సభ్యులు సింగు నరేష్ కుమార్ తదితరులు ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు. వైద్యులను కలిసి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం అందుతున్న చికిత్స, ఎదురవుతున్న వైద్యపరమైన సమస్యలపై వివరాలను తెలుసుకున్నారు.

వైద్యుల నుంచి అందిన తాజా సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అదేవిధంగా, శనివారం తెలుగు అసోసియేషన్ అఫ్ సౌదీ అరేబియా వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), ప్రసాద్  జుట్టా, ముకేష్ బద్రి కొప్పినేని మరోసారి ఆసుపత్రిని సందర్శించి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేసి, వారికి ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు తమ వంతు కృషి చేస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబ సభ్యుల మధ్యకు తిరిగి రావాలని సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ సాటా కోర్ టీం సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, టాసా సభ్యులు మరియు పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, 11 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, సంబంధిత ఏపిఎన్ఆర్టిఎస్ ప్రతినిధులు ముందుకు వచ్చి పరామర్శించకపోవడం పట్ల కొంతమంది తెలుగు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఒక తెలుగు వ్యక్తి ఆపదలో ఉన్న విషయం తెలుసుకుని తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త మహమ్మద్ షబ్బీర్, సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ సూచనల మేరకు సింగు నరేష్ కుమార్ మరియు మరికొందరు తెలుగు వారు స్పందించి ఆసుపత్రిని సందర్శించడం అభినందనీయమని పలువురు తెలుగు ప్రజలు, తెలుగు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న వ్యక్తికి కులం, ప్రాంతం, రాజకీయ అనుబంధం వంటి భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో అండగా నిలవడమే నిజమైన తెలుగు స్ఫూర్తి అని వారు అభిప్రాయపడ్డారు.