republichindustan.in
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 4:35 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

నకిలీ పత్తి విత్తనాల అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

ప్రధాన నిందితుల అరెస్ట్ – రూ.19 లక్షల విలువైన విత్తనాలు, పురుగుమందులు స్వాధీనం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ, ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను విక్రయిస్తూ కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

స్థానిక పోలీసు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు, అనుమతులు లేని బయో-పెస్టిసైడ్స్, గడువు ముగిసిన విత్తనాలు, తయారీ సామగ్రి, ప్యాకింగ్ యంత్రాలు, ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుల వివరాలు

A1) సందేశ్ బండేవర్ (35), బిట్టర్‌గావ్ గ్రామం, ఉమార్ఖేడ్ తాలూకా, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర – నకిలీ పత్తి విత్తనాల కొనుగోలు, పంపిణీదారుడు (పరారీ).

A2) పాపిన్వర్ సునీల్ కుమార్ (56), యజమాని, నితిక్షా అగ్రిటెక్ & జీనియస్ క్రాప్ సైన్సెస్, కొత్తపేట, హైదరాబాద్ – నకిలీ పత్తి విత్తనాల విక్రయాల ప్రధాన నిర్వాహకుడు (అరెస్ట్, రిమాండ్).

A3) రాథోడ్ పండిత్ (32), యవత్మాల్, మహారాష్ట్ర – విత్తనాలు తరలించే వ్యక్తి (అరెస్ట్, రిమాండ్).

A4) రాథోడ్ బాలాజీ (35), యవత్మాల్, మహారాష్ట్ర – విత్తనాలు తరలించే వ్యక్తి (అరెస్ట్, రిమాండ్).

A5) గిరీష్ పటేల్, యజమాని, సీడ్స్ కంపెనీ, ఇదార్, గుజరాత్ – నకిలీ పత్తి విత్తనాల సరఫరాదారు (ఇచ్చోడలో అరెస్ట్).

A6) ఈశ్వర్, ధాబా-కే గ్రామం, ఇచ్చోడ మండలం – నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుడు (ఇచ్చోడలో అరెస్ట్).

A7) గణేష్, ధాబా-బి గ్రామం, ఇచ్చోడ మండలం – నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుడు (పరారీ).

A8) కృష్ణ, యవత్మాల్, మహారాష్ట్ర – విత్తనాల సరఫరాదారు (పరారీ).

A9) కిరణ్, హస్నాపూర్, ఉట్నూరు మండలం (పరారీ).

విచారణలో వెల్లడైన వివరాలు

నిందితుడు పాపిన్వర్ సునీల్ కుమార్ 2008 సంవత్సరం నుంచి వివిధ సీడ్స్ కంపెనీలలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, ఎరువుల దుకాణదారులతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం 2018లో హైదరాబాద్‌లో నితిక్షా అగ్రిటెక్, జీనియస్ క్రాప్ సైన్సెస్ పేర్లతో సంస్థలు స్థాపించి సీడ్స్, బయో-పెస్టిసైడ్స్ వ్యాపారం ప్రారంభించాడు.

సాధారణ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో గుజరాత్ రాష్ట్రంలోని ఇదార్‌కు చెందిన గిరీష్ పటేల్ వద్ద నుంచి గత నాలుగేళ్లుగా నకిలీ పత్తి విత్తనాలు తెప్పించి విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు.

ఇచ్చోడ మండలానికి చెందిన ఈశ్వర్, గణేష్, అలాగే మహారాష్ట్రకు చెందిన సందేశ్ బండేవర్ సహకారంతో రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది మార్చిలో గిరీష్ పటేల్ వద్ద నుంచి PINK BOND పేరుతో 500 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు తెప్పించగా, వాటిలో 300 ప్యాకెట్లు ఈశ్వర్‌కు, 158 ప్యాకెట్లు గణేష్‌కు విక్రయించినట్లు, మిగిలిన 42 ప్యాకెట్లను మహారాష్ట్రకు చెందిన వ్యక్తులకు ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ వద్ద అందజేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

భారీగా స్వాధీనం

పోలీసులు నిందితుడి కంపెనీలో నిర్వహించిన తనిఖీల్లో 792 పింక్ బాండ్ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, అనుమతులు లేని బయో-పెస్టిసైడ్స్, గడువు ముగిసిన విత్తనాలు, ప్యాకింగ్ మెటీరియల్, ముడి పదార్థాలు, లేబుల్ ప్రింటింగ్ యంత్రం, ప్యాకింగ్ యంత్రం, ఎలక్ట్రానిక్ తూకం యంత్రం, ఇండికా విస్టా కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు రూ.9,50,400, గడువు ముగిసిన విత్తనాలు, మందులు మరియు ఇతర సామగ్రి విలువ సుమారు రూ.9.5 లక్షలు ఉండగా, మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.19,00,400 వరకు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

రైతులకు సూచనలు

రైతులను మోసం చేసి అక్రమ లాభాల కోసం నకిలీ విత్తనాల వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా అధికారిక డీలర్ల వద్ద నుంచి బిల్లుతో విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విత్తనాలు లేదా పురుగుమందుల విక్రయాలపై సమీప పోలీసు స్టేషన్ లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

స్థానిక వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు అఖిల్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.