republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 1:48 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

ఇచ్చోడాలో బీఆర్ఎస్ రాస్తారోకో – కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  ఇచ్చోడా మండలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గులాబీ సైన్యం హెచ్చరించింది. పాలనలో వైఫల్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌పై కేసులు, నోటీసుల పేరిట వేధింపులు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమ సారథి, ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన నాయకుడికి నోటీసులు ఇవ్వడం తెలంగాణ నేలకే అవమానమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నామని, అక్రమ కేసులతో భయపడేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

కేసీఆర్‌ను ఎస్ఐటీ విచారణ పేరిట వేధించడాన్ని ఖండిస్తూ, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, మాజీ సర్పంచ్ పాండు రంగ్, నార్వడే రమేష్, షాబీర్, మతిన్, గణేష్, ప్రవీణ్, గణపతి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.